లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
శుక్రవారం మహదేవ్ పూర్ మండలంలోని
బొమ్మాపూరు శివారు కోతకు గురైన మందిరం చెరువు కట్ట, బొమ్మపూర్ యస్.సి కాలనీలోని దూదేకుల ఓర్రె, ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయితీ భవనం, పెద్దంపేట వాగు వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.
బొమ్మపూరు శివారు మందిరం చెరువు వర్షం కారణంగా నిండి మత్తడి పోస్తుందని, చెరువు కట్ట కోతకు గురయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు తెలుపగా వెంటనే చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి పటిష్టం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బొమ్మపూరు ఎస్సి కాలని వద్ద గల దూదేకుల ఒర్రే కల్వర్టును పరిశీలించి ఆర్ & బి అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఒర్రే కాలువ లోని చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు తొలగించి నీరు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలను, గ్రామ పంచాయితి భవనాన్ని పరిశీలించి నాలుగవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు.
అనంతరం అంబటి పల్లి శివారు లోని పెద్దంపేట వాగు బ్రిడ్జిని, వాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, కుంటలపై నిరంతర నిఘా ఉంచాలని అన్నారు. పంచాయితి కార్యదర్శులు గ్రామ స్థాయిలో ప్రతి విషయం పై అప్రమత్తతతో వ్యవహరిస్తూ ఏదైనా సమస్య ఉంటే సమాచారం అందించాలని తెలిపారు. ప్రజలు పొంగి పొర్లే వాగులు, రహదారుల్లో ప్రయాణాలు నియంత్రణ చేయాలని సూచించారు. రానున్న 4 రోజులు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న నేపద్యంలో చెరువులు కోతకు గురవకుండా పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. చెరువులు పరిశీలించాలని లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ చర్యలు పర్యవేక్షణ చేయాలని అన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్దం చేయాలని ఆదేశించారు. ముంపు తగ్గేవరకు అధికారులు అత్యంత జాగ్రత్తగా ఉంటూ పరిస్థితులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు, వంగిపోయిన విద్యుత్ స్థంభాలు, వంగిన చెట్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ , ఎంపీడీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.