వివాదంలో డబల్ ఇస్మార్ట్ సాంగ్..పాటలో KCR డైలాగు ఉండడం పై BRS శ్రేణుల అభ్యంతరం
ఈ సాంగ్ మధ్యలో ఏం చేద్దాం అంటావు మరి అని కేసిఆర్ డైలాగు ఉండడంతో సోషల్ మీడియాలో బిఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్:విశ్వంభర :- పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. స్వయంగా పూరి జగన్నాథ్ ఛార్మితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోగా నటించిన రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు. అయితే మొదటి భాగంలో నటించిన నభా నటేష్, నిధి అగర్వాల్ మాత్రం ఈ సినిమాలో నటించడం లేదు. హీరోయిన్గా కావ్య థాపర్ నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మార్ ముంత చోడ్ చింత అనే సాంగ్ రిలీజ్ చేశారు.
అయితే ఈ సాంగ్ మధ్యలో ఏం చేద్దాం అంటావు మరి అని కేసిఆర్ డైలాగు ఉండడంతో సోషల్ మీడియాలో బిఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను అవమానించే విధంగా ఆయన మాటలను ఒక ఐటెం సాంగ్ లాంటి పాటలో ఎలా పెడతారు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా చేశారని అప్పుడే ఆయనకు బుద్ధి చెప్పి ఉంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలో కెసిఆర్ మాటలను వాడే ధైర్యం చేసి ఉండేవారు కాదని అంటున్నారు. అంతేకాదు పాట నుంచి కేసీఆర్ మాటలను తొలగించకపోతే మహిళలంతా కలిసి పూరి జగన్నాథ్ ఇంటిని ముట్టడిస్తామని, సినిమాని తెలంగాణలో రిలీజ్ చేయకుండా చేస్తామని హెచ్చరించారు. మరి ఈ విషయం మీద పూరి జగన్నాథ్ అండ్ టీం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.