రూ.1215 లక్షలతో కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులు
విశ్వంభర భూపాలపల్లి జూలు13 :- భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం లో రూ. 12 కోట్ల 15 లక్షలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టబోతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శనివారం రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్, ఆలయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలతో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే కొడవటంచ గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12కోట్ల 15 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అట్టి నిర్మాణ పనులను సంవత్సరం తిరిగే లోపు పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
- రూ.12కోట్ల 15లక్షలతో చేపట్టబోయే పనులు.., ఆలయంలో విమాన గోపురం, అర్థ మండపం, మహామండపం పనులను రీ - కన్స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా, అద్దాల మండపం, అల్వార్ నిలయం, పాకశాల, అన్నదాన సత్రం, క్యూలైన్ల ఏర్పాటు, డ్రైనేజీ, భక్తుల కొరకు కాటేజీలు, సాలహారం కాంపౌండ్ వాల్, ఓ హెచ్ ఎస్ ఆర్ వాటర్ ట్యాంక్, ఆఫీస్ బిల్డింగ్, అర్చకులు ఉండేందుకు వసతి గృహాలు, రేగొండ క్రాస్ రోడ్ లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఆర్చి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మీడియాకు వివరించారు. అదేవిధంగా, రూ.59 కోట్లతో బుద్దారం నుండి కొడవటంచ డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే మంజూరు రాబోతున్నట్లు తెలిపారు.
అంతకు ముందు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చమాచార్యులు పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.