ఎనభై ఫీట్లుగా అల్విన్ బైపాస్ రోడ్డు విస్తరణ
రూ.12 కోట్లు మంజూరు చేయించిన జగ్గారెడ్డి
- బసవేశ్వర, శివాజీ, అంబేద్కర్, మహాత్మగాంధీ, నెహ్రూ, రాజీవ్‌గాంధీల పేరిట ఆరుచోట్ల జంక్షన్లు
- 2.5కి.మీలు పాదయాత్ర చేసి పరిశీలించిన జగ్గారెడ్డి
- ప్రజలు, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని అన్ని శాఖల అధికారులకు జగ్గారెడ్డి ఆదేశం
విశ్వంభర,సంగారెడ్డి : ఎనభై ఫీట్లుగా సంగారెడ్డి పట్టణంలోని అల్విన్ బైపాస్‌రోడ్డును విస్తరించడానికి రూ.12 కోట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విడుదల చేయించారు. ఐబీ గెస్ట్‌హౌజ్ నుండి నేషనల్ హైవే సమీపంలోని గుర్రపు బొమ్మ వరకు 2.5 కిలోమీటర్లు ఈ రహదారిని విస్తరించే క్రమంలో మంగళవారం జగ్గారెడ్డి సమీక్షించారు. మున్సిపల్, ఆర్‌అండ్‌బి, ఎలక్ర్టిసిటీ, హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి బైపాస్ రోడ్డులో పర్యటించారు. రోడ్డు మధ్యలో సింగిల్ స్టోన్‌తో డివైడర్ ఏర్పాటు చేయాలని, ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. రహదారి విస్తరణలో భాగంగా డబ్బాలను తాత్కాలికంగా తొలగించి, పనులు పూర్తికాగానే అదే చోట మళ్లీ డబ్బాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. 2.5కి.మీలు జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తూ వ్యాపారులు, ప్రజల సలహాలు స్వీకరించారు. రహదారి విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పారు. కాగా ఐబీగెస్ట్ నుండి గుర్రపు బొమ్మ వరకు ఆరుచోట్ల జంక్షన్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. బసవేశ్వర, శివాజీ, అంబేద్కర్, మహాత్మగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్‌గాంధీల పేరిట ఈ జంక్షన్లు ఉండాలని జగ్గారెడ్డి తెలిపారు .