రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య

విశ్వంభర, హైదరాబాదు : కాచిగూడ: బీసీలు రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా ఉద్యమించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. కోల జనార్ధన్ అధ్యక్షతన శనివారం కాచిగూడలో ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల పక్ష పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్నేత వి. హనుమంతరావు, బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, టీ టీడీపీ జాతీయ నాయకులు అరవింద్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేతలు గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీసీలకు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా రావాల్సిన వాటా మర్యాదగా ఇవ్వాలని, లేని పక్షంలో యుద్ధమే జరుగుతుందని హెచ్చరించారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టనున్న బీసీ బిల్లుకు అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో మద్దతు పలకాలని, లేని పక్షంలో ఆయా పార్టీలకు బీసీలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని అన్నారు. దేశ జనాభా గణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మన ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వేముల రామకృష్ణ. నీల వెంకటేష్, తంగెళ్లముడి నందగోపాల్, ఉదయేనేత, సుందర్ రాజ్, వంశీకృష్ణ, వేణు, సుధాకర్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.