గీతంలో జాతీయ టెక్ ఫెస్ట్ హవానా ప్రారంభం
సాంకేతిక ప్రతిభను ప్రదర్శిస్తున్న ఔత్సాహికులు, ఉత్తేజకరమైన సవాళ్లతో పోటీ

విశ్వంభర, సంగారెడ్డి : ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు రోజుల జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ హవానా-2025 గురువారం హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా ప్రారంభమైంది. సాంకేతిక నైపుణ్యం అనుభూతులతో స్ఫూర్తిని రగిల్చే ఈ కార్యక్రమాన్ని ఈఈసీఈ విభాగానికి చెందిన జీ-ఎలక్ట్రా (స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్) నిర్వహిస్తోంది. అత్యాధునిక ఆవిష్కరణలను అన్వేషించడానికి, సృజనాత్మకతను పెంపొందించడానికి, అవకాశాల సరిహద్దులను పునర్నిర్వచించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం తోడ్పడుతోంది. షోలాపూర్ లోని ఎన్ కే ఆర్చిడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బీ.దఫేదార్ ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో పరిశ్రమ సమస్యలతో నిమగ్నమవ్వాలని ప్రోత్సహించారు. విజయానికి నాలుగు మంత్రులంటూ- ఆన్ లైన్ వనరులను ఒడుపుగా వినియోగించుకోవడం, నైపుణ్య అభివృద్ధిని మెరుగు పరచుకోవడం, పరిశ్రమ పరస్పర చర్యను పెంపొందించడం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడమని చెప్పారు.విద్యార్థులు, సాంకేతిక ఔత్సాహికులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, ఉత్తేజకరమైన సవాళ్లతో పోటీ పడటానికి, విభిన్న సాంకేతిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి అధ్యక్షత వహించగా, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి స్వాగతోపన్యాసం చేశారు. దేశ నలుమూలల నుంచి 40 కళాశాలలకు చెందిన 150 బృందాలు ఈ పోటీలలో పాల్గొంటున్నట్టు చెప్పారు. జీ-ఎలక్ట్రా అధ్యక్షుడు ఎం. సాయికృష్ణ స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ కార్యకలాపాలపై నివేదికను సమర్పించగా, ఉపాధ్యక్షుడు జి. శౌరీ జేమ్స్ వందన సమర్పణ చేశారు. అధ్యాపకుడు ఎం. నరేష్ కుమార్ కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేశారు. శుక్రవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.