టీ20ల్లో గెలవాలంటే 50, 100లు అక్కర్లేదు: రోహిత్ శర్మ

టీ20ల్లో గెలవాలంటే 50, 100లు అక్కర్లేదు: రోహిత్ శర్మ

  • బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా
  • సూపర్-8లో వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపు 
  • సెమీస్ దిశగా పరుగులు

టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్ దిశగా దూసుకెళ్తోంది. సూపర్-8లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలకు మరింత దగ్గరగా వెళ్లింది. బంగ్లాదేశ్‌ను 50 పరుగుల తేడాతో చిత్తు చేసి గ్రూప్-1లో అగ్రస్థానంలోకి నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిక్యంతో బంగ్లాను చిత్తు చేసింది. అయితే, ఈ విజయంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘బ్యాటింగ్ చేసేటప్పుడు దూకుడు ప్రదర్శించడంపై ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు ఇలా ఆడాల్సి ఉంటుంది. జట్టులో ప్రతీఒక్కరు అద్భుతంగా ఆడారు. పరిస్థితులకు త్వరగా అలవాటుపడి మంచి ప్రదర్శనను చూపారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉంది.  బ్యాటింగ్, బౌలింగ్‌లో స్మార్ట్‌గా ఆలోచించాం. ఎనిమిది మంది బ్యాటర్లు బరిలోకి దిగడం కూడా కలిసొచ్చింది. అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. 

జట్టులో ఒకరు హాఫ్ సెంచరీ చేయడంతో బంగ్లా ముందు 197 పరుగుల లక్ష్యం ఉంచగలిగాం. టీ20ల్లో ఎక్కువగా ఫిఫ్టీ(50)లు, సెంచరీ(100)లు అవసరం లేదనుకుంటా. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకొస్తే పరుగులు సులువుగా వస్తాయి. జట్టులో ఎక్కువ అనుభవమున్న ప్లేయర్లే ఉన్నారు. పాండ్య బ్యాటింగ్‌లో మెరిస్తే మాదే పైచేయి అవుతుందని గత మ్యాచ్ సమయంలోనే వెల్లడించా. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌తో కలిసి పరుగులు చేసే బాధ్యతను పాండ్య తీసుకున్నాడు. బౌలర్‌గానూ మాకు అత్యంత కీలకమైన ప్లేయర్. కుల్దీప్, బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.