సిరిసిల్లలో మరో నేత కార్మికుడి బలవన్మరణం

సిరిసిల్లలో మరో నేత కార్మికుడి బలవన్మరణం

  • మరమగ్గాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న నాగరాజు
  • కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం 
  • మనస్తాపంతో బాత్ రూమ్‌లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేత కార్మికుల ఆత్మహత్యలు ఆగడంలేదు. అప్పుల బాధతో మరో నేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి 11 వార్డు రాజీవ్ నగర్‌కు చెందిన కుడిక్యాల నాగరాజు (47) భార్య లావణ్య, కొడుకులు లోకేష్, విఘ్నేష్ ఉన్నారు. నాగరాజు మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఆరు నెలలుగా ఉపాధి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు.

ఈ క్రమంలో రూ.4లక్షల అప్పు అయింది. ఫస్ట్ ఇయర్ తన కుమారుడి కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బులు ఎలా కట్టాలో తెలియక సతమతమవుతున్నాడు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన నాగరాజు ఇంట్లో బాత్‌రూంలో వాడే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందాడు. నాగరాజు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

Read More విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం