ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించేది లేదు
-శ్రీరామనవమి బ్రహ్మోత్సవములు - 2025
- విజయవంతంగా ముగిసిన ఉత్సవాలు
- అసత్య ప్రచారాలపై ఖండన
- శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం
విశ్వంభర, భద్రాచలం – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - శ్రీరామనవమి బ్రహ్మోత్సవములు ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు వేచిచూసే పవిత్ర సందర్భం. 2025 సంవత్సరానికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి మరియు ఉద్యోగ సిబ్బంది గత మూడు నెలలుగా నిరంతరంగా శ్రమించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, జనసందర్శన, భద్రతా ఏర్పాట్లు, తలంబ్రాల తయారీ, పంపిణీ వంటి అనేక అంశాల్లో సవాళ్లు ఎదురైనా, సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఉత్సవాలను విజయవంతంగా ముగించగలగడం జరిగింది.అయితే, ఇటీవలి కొన్ని రోజులుగా కొన్ని సోషల్ మీడియా వేదికలలో మరియు ఇతర ప్రచార మాధ్యమాలలో తలంబ్రాల పంపిణీ విషయంలో తప్పుడు సమాచారాన్ని , ఈ దేవస్థానం ప్రతిష్ఠను దిగజార్చే విధంగా కామెంట్లు, పోస్టులు రావడం బాధాకరం. కొందరు వ్యక్తులు తమ స్వార్థపరమైన ప్రయోజనాల కోసమో లేక ఇష్టానుసారంగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ని మరియు దేవస్థాన సిబ్బందిని బ్లాక్‌మెయిల్ చేసే విధంగా దుష్ప్రచారానికి పాల్పడిన తీరు దేవస్థాన ఉద్యోగ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది.తలంబ్రాల పంపిణీ పట్ల వాస్తవ సమాచారం ఇదే:శ్రీరామనవమి రోజు నుండి మొదలుకుని ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు, మీడియా ప్రతినిధులకు, ప్రముఖులకు అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. దేవస్థాన విశేష శాఖలైన ఆన్లైన్, కార్గో, పోస్టల్ మరియు ప్రచార విభాగాల సహకారంతో 06.04.2025నుంచి పంపిణీ ప్రారంభమైంది. ముత్యాల తలంబ్రాల పంపిణీకి గాను ప్రత్యేక సిబ్బందిని నియమించి, ప్రతీ దశలో పర్యవేక్షణతో పంపిణీ జరగనది. ఇంకా తలంబ్రాలు అందని వారికి బియ్యం రూపంలో భద్రాచలంలోని కౌంటర్ల ద్వారా అందజేయడం ఇప్పటికీ కొనసాగుతోంది.జిల్లా కలెక్టర్ సూచనల మేరకు శక్తికొలది భక్తులకు అందించేందుకు యత్నించినప్పటికీ, తలంబ్రాల లభ్యత పరిమితంగా ఉండటం వల్ల కొందరికి ఆలస్యంగా అందడం జరిగినదేగానీ, అవకతవకలేమీ జరగలేదు. అయినప్పటికీ తప్పుడు సమాచారంతో సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, వీడియోలు రూపొందించడం, అసత్య ఆరోపణలు చేయడం హేయకృత్యం.
ఈ సందర్భంగా మా స్పష్టమైన స్థానం:
1. దేవస్థాన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడాన్ని దేవస్థానం యూనియన్ తీవ్రంగా పరిగణిస్తోంది. అవసరమైతే పోలీసు శాఖల సహకారంతో విచారణకు పూనుకుంటాం.
2. భక్తుల విశ్వాసం మా బలమూ, ధ్యేయమూ. భక్తులందరికీ తలంబ్రాలు అందించాలనే ధ్యేయంతో మా కృషి కొనసాగుతుంది.
3. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి గారి దౌత్యం మరియు ఉద్యోగుల అంకితభావంతో ఈ ఉత్సవాలు ఇంత వైభవంగా జరిగాయి అనే దానిపై స్పష్టత ఇవ్వాలి.
4. ప్రచార మాధ్యమాలు నిర్ధారిత సమాచారం ఆధారంగా స్పందించాలి. తప్పుడు ప్రచారం తగిన స్థాయిలో చట్టరీత్యా ఎదుర్కొనబడుతుంది.
శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో భక్తుల సేవలో నిస్వార్థంగా పని చేస్తున్న మా దేవస్థానం సిబ్బందిపై నమ్మకాన్ని కొనసాగించాలని మీడియా మరియు ప్రజానీకాన్ని మనవి చేస్తున్నాము.
- దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భద్రాచలం



