తెలుగు జానపదం బిరుదు రాజు రామరాజు
విశ్వంభర, బ్యూరో : బిరుదు రాజు రామరాజు హై స్కూల్ విద్యార్థిగా ఉన్న నాటి నుండి, "భారతి" మొదలైన పత్రికలలో మానవల్లి, వేటూరి, నిడదవోలు, మల్లంపల్లి, వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథములు పీటికలు చదివాడు. వారిలాగే సాహిత్య లోకానికి తెలియని క్రొత్త విషయాలు తాను కూడా చెప్పాలని నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టాడు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో దక్షిణ దేశభాషలన్నింటిలోనూ, బిరుదు రాజు రామరాజు యొక్క "తెలుగు జానపద గేయ సాహిత్యం" మొదటి సిద్ధాంత గ్రంథం అయింది. జానపద గేయ రంగంలో అనేక జానపద గేయాలు సంకలనాలు బిరుదరాజు రామరాజు ప్రకటించాడు. తెలుగులో, ఇంగ్లీషులో, జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పరిశోధనాత్మక పత్రాలు, రామరాజు చదివాడు. ఇంగ్లీషులో "ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ పి." ఫోక్ లోరు ఆఫ్ ఏ పి. సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లీంప్పెస్ ఇన్ టూ, తెలుగు ఫ్లోక్ లోర్,అనే గ్రంథాలు బిరుదు రాజు ప్రకటించాడు. బిరుదు రాజు తెలంగాణ అంతా తిరిగి వందల కొద్ది తెలుగు, సంస్కృతంలో ఉన్న తాళపత్ర గ్రంధాలు, పదులకొద్దీ, శిలా శాసనాలను, సేకరించాడు. అచ్చు కాకుండా పడి ఉన్న తెలుగు, సంస్కృత కావ్యాలను దాదాపుగా నూరింటిని సాహిత్య ప్రపంచానికి తెలియజేశాడు. మరుగున పడిన మాణిక్యాలు, చరిత్రకి ఎక్కనీ చరితార్థులు, అనే పేరుతో అనేక వ్యాసాలు పత్రికల్లో బిరుదు రాజు రాశాడు.
పరిష్కరించిన, గ్రంధాలు:- సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన 'వసు చరిత్రం' మధురవాణి రచించిన రామాయణ సార తిలకం, వెల్లలా ఉమామహేశ్వర్లు 'శృంగార శేఖర బాణం' శ్రీకృష్ణదేవరాయల జాంబవతి పరిణాయ నాటకం, మొదటిసారిగా పరిష్కరించిన బిరుదు రాజు అనంత రామయ్య, సీతా విజయ చంపు వంటి సంస్కృత కృతులను బిరుద రాజు రామరాజు పరిష్కరించాడు.
తెలుగు గ్రంథాల పరిష్కరణ :- తెలుగులో బొడ్డు చర్ల చీన తిమ్మ కవి 'ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం' చింతపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయం, వెంకటాద్రి నాయకుని సకల జీవసంజీవనం, పాల్కురికి సోమనాథుని, పండిత రాద్యోదాదహరణం, అనే కావ్యాలను మొదటగా సేకరించి ప్రకటించారు. బిరుదు రాజు రామరాజు, "ఉర్దూ తెలుగు నిఘంటువు"ను కూర్చారు. ఇంగ్లీష్ హిందీల నుండి నాలుగు గ్రంధాలు అనువదించాడు. బిరుదు రాజు పర్యవేక్షణలో 38 మంది ఎంఫీల్, పి హెచ్ డీలు సంపాదించారు.
తెలుగు జానపద విజ్ఞాన రంగంలో విశేషమైన కృషి చేసిన వ్యక్తి ఆచార్య బిరుదు రాజు రామరాజు, పరిశోధకుడిగా, పండితుడిగా, ఆచార్యుడిగా, జాతీయ వక్తగా ప్రసిద్ధి పొందిన ఈయన వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో 1925 ఏప్రిల్ 16న జన్మించాడు. దేవునూరు, మడికొండ, హనుమకొండలో ప్రాథమిక విద్య మాధ్యమిక విద్యతోపాటు ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంగ్లీష్ మీడియం లో బిఏ పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు, ఖండవల్లి లక్ష్మీ రంజనం పర్యవేక్షణలో పిహెచ్ డి పూర్తి చేశాడు. 1952 లో ఉస్మానియా తెలుగు శాఖలో అధ్యాపకుడిగా చేరి రీడర్ గా, ప్రొఫెసర్ గా పదోన్నతి పొందాడు. 1973 నుంచి 1983 వరకు తెలుగు శాఖ అధ్యక్షులుగా కొనసాగాడు.1967 నుంచి 1974 వరకు వరంగల్ స్నాత కోత్తర కేంద్రంలో పనిచేసిన బిరుదరాజు రామరాజు 1983లో పదవి విరమణ పొందాడు.
తెలుగు జానపద గేయ సాహిత్యం పై పిహెచ్ డి చేసి ఆ రంగంలో ఎందరికో మార్గదర్శకుడయ్యడు. జానపద సాహిత్య పరిశోధన దక్షిణ భారతదేశ భాషల్లో నే మొదటి పరిశోధనగా గుర్తింపు పొందింది. బిరుదు రాజు రామరాజు వందల కొద్ది జానపద గేయాలను, అనేక తాళపత్ర గ్రంథాలను, శిలాశాసులను సేకరించాడు. ప్రాచీన కావ్యాలను పరిష్కరించాడు. ఆంధ్రదేశంలోని యోగుల చరిత్రను సేకరించి పుస్తకాలను నిలవరించాడు. ఈయన చేసిన సాంస్కృతిక సేవగాను జాతీయా చార్య పదవి లభించింది. 2010 ఫిబ్రవరి 8న హైదరాబాదులో మరణించాడు. జానపద సాహిత్యాన్ని, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన బిరుదు రాజు రామరాజు, తెలుగు జానపద సాహిత్యం అంటేనే బిరుదు రాజు రామరాజు అని చెప్పుకోవచ్చు.
ఏప్రిల్ 16 బిరుదు రాజు రామరాజు శతజయంతి సందర్భంగా
దేవులపల్లి రమేశ్,
సిద్దిపేట, నంగునూర్
9963701294



