సంపూర్ణ శతావధానంలో చౌడూరి నరసింహారావుకు ఘన సన్మానం

మండు వేసవిలో పన్నీటి జల్లులా అద్భుతంగా సాగిన సంపూర్ణ శతావధానం

   సంపూర్ణ శతావధానంలో చౌడూరి నరసింహారావుకు ఘన సన్మానం

విశ్వంభర, హైదరాబాద్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, అవధాన విద్యా వికాస పరిషత్, ప్రజ- పద్యం సంయుక్తంగా నిర్వహించిన నాంపల్లి లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ నందమూరి తారక రామారావు కళామందిరంలో 'శతావధాన షడానన' 'శతావధాన పూర్ణచంద్ర' బిరుదాంకితులు చెన్నూరు జూనియర్ కళాశాల ప్రాంశుపాలురు (ప్రిన్సిపాల్) డాక్టర్ మారేపల్లి వేంకట రమణ పట్వర్ధన్ గారి సంపూర్ణ శతావధానం మూడు రోజుల పాటు ముచ్చటగా, అత్యంత వైభవోపేతంగా జరిగింది. చైత్ర పూర్ణిమ నుండి విదియ వరకు అనగా ఏప్రిల్ 12, 13, 14 (శని, ఆది, సోమ వారాలు) తేదీలలో మూడు రోజులపాటు జరిగిన ఈ శతావధాన క్రతువులో  మొదటి రెండు రోజులు అవధాని సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి మొదలైన అంశాలకు ప్రాశ్నికులు అడిగిన పలు విషయాల మీద అవధాని అద్భుతమైన పదాలతో, సమాసాలతో, వృత్తాలతో అధిక శాతం పద్య పూరణలు చేయగా, చివరి రోజైన సోమవారం నాడు అన్ని పద్యాలను ధారణ చేసి, సభా సదులందరినీ ఆశ్చర్యచకితులను, ఆనందభరితులను గావించారు. ఇందులో భాగంగా 'వర్ణన' అంశంలో నాగోలు వాస్తవ్యులు ప్రముఖ కవి, సాహితీవేత్త, చౌడూరి కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చౌడూరి నరసింహారావు ప్రాశ్నికునిగా పాల్గొని.." సాక్షాత్తు కలియుగ దైవమైన ఆ వేంకట రమణుడే తరలివచ్చి నేడు తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈ వేంకట రమణుడి సంపూర్ణ శతావధానాన్ని వీక్షించి, సంతృప్తుడై ఏమని ఆశీర్వదిస్తాడని వర్ణించమని కోరగా..." శ్రీపతి నేనా మెచ్చితి
స్థాపిత సంతోష మగుచు సత్పద్యమ్మౌఈ పండిత సభ వెలిసెడి ప్రాపౌట నటంచు బలికె బాలాజియె తాన్ " అంటూ....
ఆ ఏడుకొండల వేంకట రమణుడిలో పరకాయ ప్రవేశం చేసి, బహు అందమైన కంద పద్యాన్ని అందించారు.  అవధాని  అద్భుతమైన పూరణతో సభ యావత్తూ హర్షద్వానాలతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా శ్రీ చౌడూరి నరసింహారావుకు సంపూర్ణ శతావధాన ప్రతిభా ప్రశంసా పత్రము, నగదు పురస్కారముతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన వంద పుస్తకాలను కార్యక్రమ నిర్వాహకుల సమక్షంలో చివరి రోజు సభాధ్యక్షులైన తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ముఖ్య అతిథి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భాస్కర రావు, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శ్రీ కోట్ల హనుమంతరావు, శతావధానం నిర్వహకులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ, శ్రీ నారుమంచి అనంత కృష్ణ  చేతుల మీదుగా ఘనంగా శాలువాతో చౌడూరి నరసింహారావు ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శతావధానం సంచాలకులు, శ్రీ ఆముదాల మురళి శతావధాని, కార్యక్రమ అనుసంధాన వ్యాఖ్యాత శ్రీ అవుసుల భాను ప్రకాష్ అష్టావధాని ప్రభృతులు పాల్గొన్నారు.

Tags: