అంబేద్కర్ ఆలోచన విధానమే టీజీఎస్ఆర్టీసీకి స్ఫూర్తి

ఆర్టీసీ కళాభవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంత్యోత్సవాలు

 అంబేద్కర్ ఆలోచన విధానమే టీజీఎస్ఆర్టీసీకి స్ఫూర్తి

విశ్వంభర, హైదరాబాదు :  రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని  సంస్థలో మూడున్నరేళ్లుగా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. భవిష్యత్ లోనూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకుసాగాలని ఆయన అన్నారు. టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంత్యోత్సవాలు హైదరాబాద్ లోని కళా భవన్ లో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. కులం, మ‌తం, లింగ బేధం లేకుండా ప్ర‌జ‌లంద‌రికీ స‌మాన అవ‌కాశాలుండాల‌ని అంబేద్క‌ర్ పోరాడారని కొనియాడారు. బలహీన వర్గాలకు చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి అంబేడ్కర్ అని,  ఆయన ఆశయాలు తరతరాలకు స్ఫూర్తి అని కీర్తించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్టీసీలో ఇటీవ‌ల 3038 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చిందని, ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను ఈ నియ‌మాయాల్లో సంస్థ అమ‌లు చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యాజమాన్యం పరిశీలిస్తోందని, కొందరు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, ఖుస్రోషా ఖాన్, రాజశేఖర్, వెంకన్న, జాయింట్ డైరెక్టర్ నర్మద, సీపీఎం ఉషాదేవి, రంగారెడ్డి ఆర్ఎం శ్రీలతతో పాటు ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘ నాయకులు రాజయ్య నాయక్, గడ్డం శ్రీనివాస్, సుభాష్, యాదయ్య, కృష్ణ, చంద్రకళ, కౌసల్య, తదితరులు పాల్గొన్నారు. 

Tags: