సిద్దిపేటలో తూతూ మంత్రంగా అంబేద్కర్ జయంతి
- కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు సైతం సభకు డుమ్మా
- - అధికారిక కార్యక్రమానికి ప్రజాప్రతినిధుల గైర్హాజరు
- - మంత్రి పొన్నం, ఎంపీ రఘునందన్‌రావు ఎగనామం
- - చుట్టపు చూపుగా హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
- - హరీశ్‌రావు రాక కోసం చివరి వరకు ఎదురుచూపులు
విశ్వంభర-సిద్దిపేట :అంబేద్కర్ 134 జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూర్, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి తదితర మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఆయన విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు మాల, మాదిగ, బీసీ సంఘాల నాయకులు హాజరై ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచమంతా అంబేద్కర్‌ను కీర్తిస్తోన్న మనదేశంలో మాత్రం కేవలం దళిత సంఘాల నాయకుడిగానే గుర్తిస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి 70ఏండ్లు దాటిన దళితులను సమాజంలో ఇంకా చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమానత్వ భావన వచ్చినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా అధికారిక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు, మంత్రి పొన్నం ప్రభాకర్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్లు ఎవరూ కూడా హాజరుకాలేదు. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రట్స్ గైర్హాజరు కావడంతో దళిత సంఘాల నాయకులు తీవ్రంగా నిరసించారు. తమ తమ ఉపన్యాసాల్లో వారి అగ్రకుల వైఖరిని ఎండగట్టారు. దళితులు నిర్వహించుకునే అతిపెద్ద పండుగ.. అందులోనూ అధికారిక కార్యక్రమానికి ప్రతొక్క ప్రజాప్రతినిధి డుమ్మాకొట్టడం ఏంటని పలువురు చర్చించుకున్నారు. ఇంతదానికి లక్షల నిధులు విడుదల చేయడం ఎందుకని.. తమ డబ్బులతో తామే నిర్వహించుకోవడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రతియేటా ఇలాగే సాగుతోందని, తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని నిర్వహించి తమ మనోభావాలను దెబ్బతీస్తున్నాని గుసగుసలాడారు. ఎన్నికలప్పుడు తమ ఇంటింటికీ కాళ్లరిగేలా తిరిగే నాయకులు, ఇంత పెద్ద పోగ్రామ్‌కు రాకపోవడం ఎంతవరకు సమంజసమని పలువురు మాట్లాడుకోవడం కనిపించింది.
హరీశ్‌రావుపైనే ఫోకస్
------------------
స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావుకు డైనమిక్ లీడర్‌గా మంచి పేరుంది. ప్రతొక్క కులాన్ని దగ్గరకు తీసుకుని ప్రేమ, అప్యాయతలు పంచుతారనే పేరు ప్రఖ్యాతలు ఆయన సొంతం. కానీ అటువంటి లీడర్ కూడా అధికారిక కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై దళిత సంఘాల నాయకులు జీర్ణించుకోలేకపోయారు. జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద పోగ్రామ్ పెట్టుకుని చిన్నచిన్న కార్యక్రమాలకు హాజరుకావడం ఏంటని చర్చించుకున్నారు. ఒకానొక దశలో కావాల్సుకునే రాలేదని అభిప్రాయాన్ని సైతం వ్యక్తపరిచారు. సభ ప్రారంభం నుంచి ఎమ్మెల్యే హరీశ్‌రావు రాక కోసం చివరివరకు వేయి కండ్లతో ఎదురుచూశారు. సాయంత్రం మూడుగంటలకు సమయమిచ్చారని అప్పుడు వస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆ సమయానికి కూడా రాకపోవడంతో చేసేదేమి లేక నిరాశగా సభను ముగించారు.
కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల సైతం డుమ్మా
---------------------------------
జిల్లా కలెక్టర్ మనుచౌదరి అగ్రకుల మనస్తత్వం గల వ్యక్తని పలువురు సభలో గుసగుసలాడారు. ఆ అగ్రకుల స్వభావంతోనే దళిత బహుజనులు నిర్వహంచుకునే ఏ ఒక్క కార్యక్రమానికి కూడా హాజరుకావడం లేదని ఫైర్ అయ్యారు. జగ్జీవన్‌రామ్, ఫూలే జయంతి అధికారిక కార్యక్రమాలకు కూడా కలెక్టర్ డుమ్మా కొట్టాడు. మొన్నటి జగ్జీవన్‌రామ్ కార్యక్రమానికి కలెక్టర్ గైర్హాజరు కావడంతో దళిత సంఘాల నాయకులు బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలోని జగ్జీవన్‌రామ్ విగ్రహం ఎదుట నిరసించారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆ సందర్భాన్నైనా గుర్తించుకుని అంబేద్కర్ జయంతికి హాజరు కావాలి. అయినాగానీ కలెక్టర్ హాజరుకాలేదు. పోనీ అడిషనల్ కలెక్టర్లు గరీమా, హామీద్‌లు హాజరయ్యారా అంటే అదీ లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బ్యూరోక్రట్సే తమకు నచ్చినట్టుగా విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
మంత్రి పొన్నం, ఎంపీ రఘునందన్‌రావు ఎగనామం
-----------------------------------------
బలహీనవర్గాలకు చెందిన మంత్రిగా పొన్నం ప్రభాకర్ అంటే ప్రతొక్కరికి గౌరవం. ఆయన కూడా సభకు హాజరుకాకపోవడంపై దళిత బహుజనలు విస్మయం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రితో ‘జై భీమ్’ పాదయాత్ర ఉందనే కారణంతో మంత్రి పొన్నం సభకు రాలేదు. ఇకపోతే సామాజిక మాధ్యమాల్లో దళితులన్న, అంబేద్కరన్న ఎనలేని గౌరవం చూపిస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సైతం సభకు హాజరుకాలేదు. సామాజిక మాధ్యమాల్లో పైపై ప్రేమలు చూపించడం కాదని సరైన వేదికకొచ్చి దళిత బహుజనులపై తమ చిత్తశుద్ధి ఏంటో నిరుపించుకోవాని పలువురు అభిప్రాయపడ్డారు.
చుట్టపుచూపుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ హాజరు
----------------------------------------
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య చుట్టపుచూపుగా హాజరయ్యారు. రాలేదనకుండా వచ్చి ఓ ఐదు పదినిమిషాలుండి తనకు వేరే కార్యక్రమం ఉందని వెంటనే వెళ్లిపోయాడు. మళ్లీ వస్తానని చెప్పడంతో ఆయన కోసం కూడా పలువురు పడిగాపులు కాసినట్టు ఎదురుచూశారు. దీంతో దళిత బహుజనులు తమ బాధలు, సంతోషాలను ఎవ్వరికీ చెప్పుకోవాలో తెలియక ఆయోమయానికి గురయ్యారు.



