కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య.. కారణం ఇదేనా?
- తీవ్ర అనారోగ్య సమస్యలే కారణం?
- ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు
- రెండు రోజులుగా స్కూల్‌కు వెళ్లని ఎమ్మెల్యే భార్య రూపాదేవి
- కడుపునొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడి
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అల్వాల్ పంచశీల కాలనీలోని ఓ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
అయితే, ఎమ్మెల్యే భార్య అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రూపాదేవి రెండు సంవత్సరాల నుంచి తీవ్ర కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా స్కూల్‌కి సెలవు తీసుకొని ఇంట్లోనే రూపాదేవి ఉంటున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. రూపాదేవి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.